కామారెడ్డి జిల్లా మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో రెండు రోజుల అభ్యాస వర్గ ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఉద్ఘాటన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాచర్ల రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అభ్యాస వర్గాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇందూరు విభాగ్ అభ్యాస వర్గ జరుపుకోవడం ఎంతో శుభ సందర్భమని అన్నారు. 1949లో నలుగురు విద్యార్థులు, ఒక ప్రొఫెసర్‌తో ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి, ఎంతోమంది పేద విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. వివేకానందుని స్ఫూర్తితో, సుభాష్ చంద్రబోస్ గారి ధైర్య పరాక్రమాలతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, జ్ఞాన, శీల, ఏకత అనే పదాలను వేదాలుగా మలుచుకొని ఏబీవీపీ పనిచేస్తోందని, భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే ఏబీవీపీ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఒక సాధారణ విద్యార్థిని గొప్ప దేశభక్తుడిగా, గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడమే ఏబీవీపీ లక్ష్యమని అన్నారు.
ఏబీవీపీ ఒక సంస్థ మాత్రమే కాదని, దేశభక్తులను తయారు చేసే కర్మాగారమని, ఇది సామాజిక బాధ్యత కలిగిన సంస్థ అని రాంబాబు అభివర్ణించారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత, దేశ పౌరులందరూ, విద్యార్థులందరూ జాతీయవాదులుగా ఉండాలని ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కోసం ఏబీవీపీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందని, నేడు అది రద్దు కావడం ఏబీవీపీ ఘన విజయమని అన్నారు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే సమయంలో, రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం లేకుండా అణిచివేస్తూ, హక్కులను హరించిన ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఏబీవీపీ లక్షలాది మంది కార్యకర్తలు పోరాడారని, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న ఎంతోమంది కార్యకర్తలు జైలు జీవితం గడిపి, దేశ ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క ఏబీవీపీ కార్యకర్త, ఏబీవీపీలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని సూచించారు.
దేశంలో యువతను తప్పుదోవ పట్టించేందుకు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందని, యువతను దేశభక్తులుగా తయారు చేయడమే ఏబీవీపీ యొక్క ముఖ్య ఉద్దేశమని రాంబాబు స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్ముతూ, ప్రతి ఒక్క విద్యార్థిని దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే ఏబీవీపీ ఉద్దేశమని ఆయన అన్నారు.
ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ గారు మాట్లాడుతూ, దేశం కోసం, దేశ విద్యార్థుల కోసం పుట్టిన మహా గొప్ప సంస్థ ఏబీవీపీ అని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో, మహనీయులు కోరుకున్న భారతదేశాన్ని నిర్మించడానికి ఏబీవీపీ కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేస్తున్నారని తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా ఒక్కటేనని, మనమంతా భారతమాత బిడ్డలమేనని, తల్లి భరతమాత కోసం, దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండి పనిచేయాలని ఆయన కోరారు.






